ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేట అభివృద్ధికి జీవితాంతం కట్టుబడి ఉంటా : మంత్రి తుమ్మల

అశ్వారావుపేట అభివృద్ధికి జీవితాంతం కట్టుబడి ఉంటా : మంత్రి తుమ్మల

📰 Generate e-Paper Clip

  • రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
  • ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
  • పామాయిల్ సాగుకు అన్ని విధాలా ప్రభుత్వ ప్రోత్సాహం
  • హార్టికల్చర్ కళాశాలతో యువతకు కొత్త అవకాశాలు
  • గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రైతుల కష్టానికి గౌరవం తీసుకొచ్చే విధానాలే అమలు
  • అశ్వారావుపేట నేల బంగారం… ఏ పంటైనా ఇక్కడ పండుతుంది
  • రైతుల ఆత్మీయ సమ్మేళనంగా మారిన పామాయిల్ సభ
  • పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 14 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరైన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి ఆయిల్ పామ్ రైతులు, ఆయిల్ ఫెడ్ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు.

ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో ఈ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణలకు రైతులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ కళాబృందాల ప్రదర్శనలు, డప్పు కళాకారుల విన్యాసాలు, గిరిజన మహిళల హారతులతో సభా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.

 

తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక డిజిటల్ ప్రదర్శన :

కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక డిజిటల్ ప్రదర్శన ఆకట్టుకుంది. రైతు సంక్షేమం కోసం చేసిన పోరాటాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, విద్యా సంస్థల ఏర్పాటు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చేసిన సేవలను వీడియో రూపంలో ప్రదర్శించారు.

సభలో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు.

“గత 50 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను రాజకీయంగా నడిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నాను. ప్రజల ఆశీస్సులు లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదు. జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటాను” అని పేర్కొన్నారు.

అభివృద్ధే రాజకీయ జీవిత ధ్యేయం : రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావని, ప్రజల ప్రేమే శాశ్వతమని మంత్రి అన్నారు. ఒకప్పుడు సైకిల్ కూడా వెళ్లలేని రహదారులపై నేడు ఆధునిక వాహనాలు తిరుగుతున్నాయంటే అది అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, రహదారులు, విద్య, వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు.

గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబాటు : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జీఓ నెంబర్–3 కీలకపాత్ర పోషించిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. గిరిజన యువత చదువులో, ఉపాధిలో ముందుండాలని పిలుపునిచ్చారు.

“దేశంలో ఏ పంటైనా అశ్వారావుపేటలో పండుతుంది” : అశ్వారావుపేట ప్రాంత వ్యవసాయ సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి, “భారతదేశంలో ఎక్కడ పండే పంట అయినా అశ్వారావుపేటలో పండుతుంది. ఇక్కడి నేల ఎంతో సారవంతమైనది. రైతులు కష్టపడే స్వభావం కలిగిన వారు” అని కొనియాడారు. రైతుల ఆదాయం పెంచేందుకు శాస్త్రీయ వ్యవసాయం, ఉద్యానవన పంటలు, మార్కెట్ ఆధారిత వ్యవసాయ విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

హార్టికల్చర్ కళాశాలతో కొత్త అవకాశాలు :యువతకు ఆధునిక వ్యవసాయ విద్య అందించాలనే లక్ష్యంతో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పరిశోధనలు, ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు ఉపయోగపడే కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయాలి : ప్రపంచ మార్కెట్‌లో ఏ పంటకు అధిక డిమాండ్ ఉంటే రైతులు ఆ పంటను సాగు చేయాలని మంత్రి సూచించారు. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగు చేస్తే రైతులు ఆర్థికంగా మరింత బలపడతారని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందని, నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

రైతులకు అండగా నిలుస్తాం : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, అశ్వారావుపేటను వ్యవసాయ రంగంలో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యానవన కళాశాల ఏర్పాటు ఈ ప్రాంత భవిష్యత్తును మార్చే కీలక అడుగని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రైతులకు అవగాహన కల్పించిన ఆయిల్ ఫెడ్ అధికారులు :సమ్మేళనంలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ అధికారులు ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని వివరించారు. ఆధునిక సాగు పద్ధతులు, దిగుబడి పెంపు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పలువురు రైతులు తమ అనుభవాలను పంచుకుని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయిల్ ఫెడ్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, గిరిజన నాయకులు, వివిధ గ్రామాల రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!