ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పెళ్లి పేరుతో యువతికి మోసం.. అభి ఇంటి ఎదుట యువతి ధర్నా

పెళ్లి పేరుతో యువతికి మోసం.. అభి ఇంటి ఎదుట యువతి ధర్నా

📰 Generate e-Paper Clip

న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్

చంద్రుగొండ, ఆగస్టు 17 (వార్త సంధ్య): పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ యువతి యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన పాల్వంచ మండలం కిన్నెరసాని రూరల్ పరిధిలోని రాజాపురం, కోడిపుంజుల గ్రామాల్లో చోటుచేసుకుంది.

వనిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపురం గ్రామానికి చెందిన వజ్జ వనిత, కోడిపుంజుల గ్రామానికి చెందిన భూక్యా అభి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అభి ఆదివారం రాత్రి వనితను పుల్లయ్యగూడెం గ్రామ పరిధిలోని డంపింగ్ యార్డు ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వనిత ఆరోపణల ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను అక్కడికి తీసుకెళ్లిన అభి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో పాటు తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించింది.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన వనిత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అభి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వారు తెలిపారు. సుమారు రాత్రి 1 గంట సమయంలో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అనంతరం వనిత తన కుటుంబ సభ్యులతో కలిసి అభి ఇంటి వద్దకు చేరుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, అభినే పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆమె ఆందోళన చేపట్టింది.

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వనిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు, వైద్య పరీక్షలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, పోలీసుల దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!