ePaper
Sunday, November 1, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్మల్కారం క్వారీలో విషాదం.. ఇద్దరు యువకులు గల్లంతు!

మల్కారం క్వారీలో విషాదం.. ఇద్దరు యువకులు గల్లంతు!

📰 Generate e-Paper Clip

 

▪️ ఈత కొడుతూ లోతైన నీటిలోకి వెళ్లిన ఇద్దరు యువకులు

▪️ ఒకరి మృతదేహం వెలికితీత.. మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు

▪️ యాప్రాల్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు విహారానికి వెళ్లిన సమయంలో ప్రమాదం

 

జవహర్‌నగర్, నవంబర్ 1 (వార్తసంధ్య): సరదాగా గడిపేందుకు వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు యువకులు క్వారీ నీటిలో గల్లంతైన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ మల్కారం క్వారీ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన రక్షిత్ (19), మురారి (19), పీయూష్ (18), సయాన్ (18), రోహిత్ (18) అనే ఐదుగురు యువకులు ఆదివారం ఉదయం సరదాగా గడిపేందుకు మల్కారం క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ భోజనం తయారు చేసుకుని తిన్న అనంతరం ప్లేట్లు శుభ్రం చేస్తూ నీటిలో సరదాగా ఆడుకుంటున్నారు.

 

ప్లేట్లు తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో..

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ప్లేట్లు క్వారీలోని నీటిలో పడిపోయాయి. వాటిని తిరిగి తీసుకురావడానికి సయాన్, రోహిత్ అనే ఇద్దరు యువకులు నీటిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు జారి క్వారీలోని లోతైన నీటిలోకి వెళ్లడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన ముగ్గురు స్నేహితులు ఆందోళనకు గురై అత్యవసర సహాయం కోసం 100కు ఫోన్ చేశారు.

రంగంలోకి పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు..

ఉదయం సుమారు 9.30 గంటలకు సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం డీఆర్ఎఫ్ (విపత్తు స్పందన దళం) కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా, రోహిత్ మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీసినట్లు సమాచారం. మరో యువకుడు సయాన్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు. సరదా కోసం క్వారీల వద్దకు వెళ్లే యువత నీటి లోతును అంచనా వేయకుండా నీటిలోకి దిగడం ప్రాణాలకే ప్రమాదకరమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!