కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాంచందర్ రావు తీవ్ర విమర్శలు
హైదరాబాద్, వార్త సంధ్య : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ కర్ణాటక-తమిళనాడు కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఐటీ, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగాల్లో దేశం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.
దేశంలో గతంలో ఆరు ఐఐటీలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 20కి చేరిందని, ఎయిమ్స్, ఐఐఎంలు, ఎన్ఐటీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. యువత ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
దేశ వ్యతిరేక నినాదాలు, విచ్ఛిన్నకర శక్తులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందంటూ రాంచందర్ రావు విమర్శించారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడే శక్తులను కాంగ్రెస్ ప్రోత్సహించడం సిగ్గుచేటని అన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై పార్లమెంట్లో చర్చించాల్సింది పోయి వీధి నాటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. జార్ఖండ్‌లో వేలాది మంది విద్యార్థులు 12 రోజులుగా న్యాయం కోసం రోడ్లపై ఆందోళన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కూడా రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.4.5 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరో రూ.2 లక్షల కోట్లకు పైగా భారం మోపిందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలను, బీసీ రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు అందాల్సిన సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
హిల్ట్ పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ వర్గాలకు విలువైన భూములను అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మూడు కార్పొరేషన్ల విభజన పేరుతో ప్రజలపై అదనపు పన్నుల భారం మోపే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి
తెలంగాణలో అమలవుతున్న ఉచిత బియ్యం పథకానికి 90 శాతానికి పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ, స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని రాంచందర్ రావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రైల్వే స్టేషన్ల మోడ్రనైజేషన్, కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రామగుండం ఫెర్టిలైజర్స్ (RFCL) పునరుద్ధరణ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్ (NIMZ), హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO), ఎంఎంటీఎస్ విస్తరణ వంటి పలు ప్రాజెక్టులను కేంద్రం తెలంగాణకు అందించిందని వివరించారు.
దేశ రక్షణకు యువత ముందుకు రావాలి
దేశ రక్షణ, దేశభక్తిపై యువతకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినా తగిన స్థాయిలో స్పందించని పరిస్థితులు ఉండేవని, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాద స్థావరాలపై సరిహద్దులు దాటి దాడులు చేసి గట్టి సమాధానం ఇచ్చామని అన్నారు.
దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ భావనతో ప్రతి పౌరుడు దేశం కోసం నిలబడాలని అన్నారు.
స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన పవిత్రమైన ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్ల చరిత్ర ఉందని పేర్కొంటూ, జాతీయ గీతాన్ని అవమానించే చర్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. దేశ స్వాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను, భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు.
దేశ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తూ, మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ రాంచందర్ రావు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

