విద్యారంగంలో కామారెడ్డి జిల్లాకు అన్యాయం: విద్యార్థి సేన ఆవేదన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 13( వార్త సంధ్య )
కామారెడ్డి జిల్లా విద్యారంగ అభివృద్ధిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు పాఠశాలలు మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, జిల్లా కేంద్రం అయిన కామారెడ్డి నియోజకవర్గానికి మాత్రం స్కూల్ మంజూరు కాలేదని ఆయన విమర్శించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందించే ఈ పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే వేలాది మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
పూలే జయంతి కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వారం రోజుల్లో కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు అవుతుందని హామీ ఇచ్చారని గుర్తు చేసిన వినయ్ కుమార్, నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరియు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రత్యేక చొరవ తీసుకుని స్కూల్ మంజూరు చేయాలని కోరారు.
అదేవిధంగా కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో MBA, MCA వంటి పీజీ కోర్సులను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కోర్సుల కోసం విద్యార్థులు హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి వస్తే ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం పొందుతారని చెప్పారు.
ఇక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కోసం భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో భూమి కేటాయించినట్లు తెలిసిందని, అయితే జిల్లా కేంద్రం కామారెడ్డిలోనే ATC ఏర్పాటు చేస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు రవాణా పరంగా మరింత సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
యంగ్ ఇండియా స్కూల్, MBA–MCA కోర్సులు, ATC ఏర్పాటులో కామారెడ్డి జిల్లా విద్యార్థులకు న్యాయం చేయాలని వినయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి సేన ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు పాషా, ప్రధాన కార్యదర్శి చందు, కార్యదర్శి అశ్విని, నాయకులు నోమన్, ప్రణయ్ రిత్విక, వేణు, హిమశ్రీ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.

