ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeజాతియం23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి

23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి

📰 Generate e-Paper Clip

విద్యకు 20% బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్

సీఎం ద్వంద్వ వైఖరి విడనాడాలని విద్యావేత్తల ఆగ్రహం

 

హైదరాబాద్, జూన్ 13 (వార్త సంధ్య)

రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించి, దాదాపు 23 వేల పాఠశాలలను మూసివేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.

బెంగుళూరులో జరిగిన చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో విద్య, వైద్యమే దేశాభివృద్ధికి పునాది అని చెప్పడం పరస్పర విరుద్ధమని వారు పేర్కొన్నారు. విద్యాభివృద్ధి గురించి ఒకవైపు మాట్లాడుతూనే వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ప్రజా విద్యకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రతి విద్యార్థికి సమీపంలోనే పాఠశాల అందుబాటులో ఉండేలా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని సమావేశంలో గుర్తు చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఒక కిలోమీటర్ పరిధిలో, ఆపై తరగతుల వారికి మూడు కిలోమీటర్ల పరిధిలో పాఠశాల సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని, ఈ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల మూసివేత నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా, ప్రస్తుతం కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో మూతపడిన 6 వేల పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పాఠశాలలను మూసివేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, బహుళ తరగతి బోధన విధానమని సమావేశంలో పేర్కొన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక గది ఉండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 1,023 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 630 పాఠశాలలకు స్వంత భవనాలు లేవని, వాటికి భవనాలు నిర్మించడానికి అవసరమైన నిధులు ఖర్చు చేస్తే సరిపోతుందని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భారీగా ఖర్చు చేయడం కంటే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు వెచ్చించాలని సూచించారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాకుండా సామాజిక చైతన్య కేంద్రాలుగా పనిచేస్తాయని, అలాంటి పాఠశాలలను మూసివేయడం గ్రామీణ సమాజ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే విద్యారంగానికి కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, కొత్త జిల్లాల్లో డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది.

సీఎం ద్వంద్వ వైఖరిని విడనాడాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోవాలని సమావేశం తీర్మానించింది.

రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ

ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచేందుకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రికి 100 మంది ప్రముఖుల సంతకాలతో ఓపెన్ లెటర్ పంపడం, సర్పంచ్‌ల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించడం, అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే. చక్రధర్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు విద్యావేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!