ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణటీజీపీఎస్సీ గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి

టీజీపీఎస్సీ గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ అభ్యర్థుల తరఫున టీజీపీఎస్సీ చైర్మన్‌కు ఎమ్మెల్యేల వినతిపత్రం

దరఖాస్తు రుసుమును రూ.1000 నుంచి రూ.100కు తగ్గించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య):

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా విడుదలయ్యే నియామక నోటిఫికేషన్లలో గరిష్ట వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ,టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, గతంలో అమలులో ఉన్న G.O. Ms. No.42 ప్రకారం గరిష్ట వయోపరిమితి 46 సంవత్సరాలుగా ఉండేదని, అనంతరం జారీ చేసిన G.O. Ms. No.86 ద్వారా దానిని 44 సంవత్సరాలకు పరిమితం చేయడంతో అనేక మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో పలు శాఖల్లో చాలా సంవత్సరాల తర్వాత నియామక నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని, ముఖ్యంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO), డిగ్రీ కళాశాల లెక్చరర్ వంటి పోస్టులకు సుదీర్ఘ విరామం తర్వాత నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు. క్రమబద్ధమైన వార్షిక నియామక క్యాలెండర్ లేకపోవడం వల్ల పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యుత్తమ అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం అనేక మంది అభ్యర్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి కూడా ప్రభుత్వ సేవలో చేరే అవకాశం కల్పించేందుకు వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా టీజీపీఎస్సీ దరఖాస్తు రుసుమును ప్రస్తుతం ఉన్న రూ.1000 నుంచి రూ.100కు తగ్గించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ యువతపై భారం తగ్గించడంతో పాటు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం, టీజీపీఎస్సీ అధికారులు ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, ఇంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!