190 జీవో అమలులో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ రక్షణ సేన
అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): 317 జీవో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని, ఉద్యోగులు, ఉద్యమకారుల సమస్యల విషయంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 317 జీవో సమస్యల పరిష్కారం కోసం మంత్రులు దామోదర్ రాజా నరసింహ , దుద్ధిల్లా శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్స భ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మధ్యంతర పరిష్కారంగా 190 జీవోను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
అయితే 190 జీవో విడుదలై తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. “ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవో అమలు చేయడం లేదో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి” అని కవిత ప్రశ్నించారు.
317 జీవో బాధితుల్లో ఎక్కువ మంది టీచర్లు, వివిధ శాఖల ఉద్యోగులే ఉన్నారని, వారిని స్థానిక ప్రాంతాలకు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
190 జీవోకు, జీవో 25 రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధం లేదని, వాటిని ముడిపెట్టకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, వారికి తెలంగాణ రక్షణ సేన పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఉద్యోగులు, టీచర్ల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్న కవిత, ప్రభుత్వం వెంటనే 190 జీవోను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

