- హెల్త్ కార్డుల జాప్యంతో ఉద్యోగుల్లో ఆందోళన
- రెండున్నరేళ్లు గడిచినా హామీ అమలు కాలేదని బీఆర్ఎస్ నేతల విమర్శ
- ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య భద్రతపై తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు అందించలేదని విమర్శించారు. హెల్త్ కార్డుల అంశంపై కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు అమలు దిశగా ఎలాంటి పురోగతి లేదన్నారు. ముఖ్యమంత్రి మాట కమిటీ వినడం లేదో, కమిటీ మాట ప్రభుత్వం వినడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా ఆ అంశాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు.
ఈహెచ్‌ఎస్ పథకాన్ని ఆస్పత్రులు విశ్వసించే పరిస్థితి లేకుండా పోయిందని, ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కోతలు విధిస్తూ సరైన ఆరోగ్య సేవలు అందించకపోవడం అన్యాయమన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల విషయంలో కూడా అనేక ఆస్పత్రులు ఉద్యోగులను చేర్చుకోవడం లేదని, అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని గుర్తుచేస్తూ, వారి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జూన్ 1 నుంచి హెల్త్ కార్డులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ జి. దేవిప్రసాద్మా ట్లాడుతూ, హెల్త్ కార్డుల అమలుపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండానే జీతాల నుంచి కోతలు విధించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత పథకంలో ఎవరెవరు ఉంటారనే అంశంపై ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు.
హెల్త్ కార్డుల అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో టీఎన్‌జీఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్త దితరులు పాల్గొన్నారు.

