ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల ఆందోళన

ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల ఆందోళన

📰 Generate e-Paper Clip

  • డిండి రహదారిపై భారీ నిరసన..
  • సంప్రదాయ పూజారిత్వ హక్కులు కాపాడాలని డిమాండ్

నాగర్‌కర్నూల్, జూన్ 11 (వార్త సంధ్య): నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం లత్తిపూర్ గ్రామంలోని శ్రీ కట్ట మైసమ్మ దేవస్థానంలో తరతరాలుగా పూజారులుగా సేవలందిస్తున్న కుమ్మర్ల హక్కులను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం డిమాండ్ చేసింది. ఆలయ పూజారిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ గురువారం డిండి ప్రాజెక్టు సమీపంలోని ఆలయం వద్ద భారీ నిరసన దీక్ష నిర్వహించింది.

డిండి కట్ట మైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కుమ్మరి కుటుంబాలు, మహిళలు, సంఘ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయం వద్ద దీక్ష చేపట్టారు. తర్వాత ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ, 1947 నుంచి కుమ్మరి కుటుంబాలే ఆలయంలో పూజారులుగా సేవలందిస్తున్నాయని తెలిపారు. ఆలయ నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణలో కుమ్మర్ల పాత్ర కీలకమైందని, తరతరాలుగా కొనసాగుతున్న పూజారిత్వ సంప్రదాయాన్ని భంగపరచడం అన్యాయమని అన్నారు.

ఆలయం ఎండోమెంట్స్ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాతే వివాదం ప్రారంభమైందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సంప్రదాయ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రామదేవత ఆలయాల్లో సంప్రదాయ పూజారులుగా కొనసాగుతున్న కుమ్మర్ల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామదేవత ఆలయాల్లో కుమ్మర్లు పూజారులుగా కొనసాగుతున్నారని, ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, డిండి కట్ట మైసమ్మ ఆలయ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, సంప్రదాయ పూజారుల హక్కులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెంకటేశం తెలిపారు.

ఎమ్మెల్యే సానుకూల స్పందనతో పాటు అధికారులు చర్చలకు ముందుకు రావడంతో నిరసన దీక్షను విరమించినట్లు సంఘ నాయకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడ జయంత్ రావు, రాష్ట్ర సలహాదారు రాంచంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి నాగపూరి నగేష్, జిల్లా అధ్యక్షుడు రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన సుమారు 600 మంది కుమ్మరి సామాజిక వర్గ సభ్యులు నిరసనకు మద్దతు తెలిపారు. సంప్రదాయ పూజారిత్వ హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని సంఘ నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!