ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణరాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

📰 Generate e-Paper Clip

  • ప్రజలకు గౌరవప్రదమైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
  • తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు
  • అద్దె భవనాల స్థానంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణాలు
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమీకృత భవనాల నిర్మాణం వేగవంతం
  • ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం

హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

గురువారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలు గౌరవప్రదంగా ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

తొలి దశలో అద్దె భవనాల్లో లేదా శిథిలావస్థలో కొనసాగుతున్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించి పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే ఈ భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి తుది డిజైన్లను ఖరారు చేస్తామని, తక్కువ వ్యయంతో అత్యుత్తమ సేవలు అందించేలా నిర్మాణాలు చేపడతామని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు, తరువాత కూడా అనేక రెవెన్యూ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టడంతో అనేక పరిపాలనా సమస్యలు తలెత్తాయని విమర్శించారు. తమ ప్రభుత్వం కొత్త మండలాలకు అవసరమైన పోస్టులను మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేసిందన్నారు.

స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పటాన్‌చెరు, కోహెడ ప్రాంతాల్లో ఇప్పటికే శంకుస్థాపనలు జరిగి పనులు ప్రారంభమైనట్లు తెలిపారు.

జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్‌ల సంఖ్యకు అనుగుణంగా నిర్మించనున్నట్లు చెప్పారు. రెండు డీఐజీ కార్యాలయాలు, నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 4 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే నమూనాలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా, క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల గుర్తింపు కార్యక్రమం వేగంగా సాగుతోందని, త్వరలో సంబంధిత జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!