రాపిడో ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం క్షీణింపు
జీవనోపాధి సంక్షోభంలో ఆటో కార్మికులు
రాపిడో సేవలపై నియంత్రణ కోరుతూ ఎస్పీకి వినతి
నిబంధనల అమలుపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని డిమాండ్
కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్లు

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 09 (వార్త సంధ్య) : కొత్తగూడెం ప్రాంతంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గుదిబండగా మారిన రాపిడో సేవలను నియంత్రించి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం ఆటో యూనియన్ ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కనకం సూరిబాబు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్తగూడెం ప్రాంతంలో రాపిడో సేవలు విస్తృతంగా పెరగడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న ఆటో కార్మికులపై రాపిడో వ్యవస్థ మరింత ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. గతంలో ఇంధన ఖర్చులు మినహాయించి రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం అది రూ.400 నుంచి రూ.500కు పడిపోయిందని పేర్కొన్నారు. దీంతో ప్రతి రోజు రూ.200 నుంచి రూ.300 వరకు ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, వాహన నిర్వహణ ఖర్చులు భరించడం కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోసం రాపిడోలో చేరుతున్నప్పటికీ, మొత్తం ఆటో రంగం తీవ్ర నష్టాలను చవిచూస్తోందన్నారు. రాపిడో వాహనాలు సంబంధిత నిబంధనలు, అనుమతులు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనే అంశంపై జిల్లా పోలీసులు, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆటో కార్మికుల జీవనోపాధిని రక్షించే దిశగా తగిన చర్యలు తీసుకొని రాపిడో సేవలపై నియంత్రణ విధించాలని ఎస్పీకి సమర్పించిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లంగి శ్రీనివాస్, గంగులు, సుధాకర్, ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

