భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 07 (వార్త సంధ్య) : గ్యాస్ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. గృహ వినియోగ LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ.965 నుంచి రూ.994కు పెరిగింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఈ నిర్ణయం అదనపు భారంగా మారనుంది.
గత మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వంటగ్యాస్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెంపు కుటుంబాల ఖర్చులను మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రావడంతో వినియోగదారులు కొత్త ధరల ప్రకారం సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వంటింటి ఖర్చులు ఇప్పటికే పెరిగిన తరుణంలో తాజా గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలపై మరో ఆర్థిక భారంగా మారిందని వినియోగదారులు పేర్కొంటున్నారు.

