భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) : కొత్తగూడెం క్లబ్‌లో సన్ రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి డాన్స్ కోచింగ్ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బి.ఆర్.పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది ఎర్ర కామేష్, సన్ రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు కనకం ప్రవీణ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడిన రుక్మాంగధర్ బండారి, ఎర్ర కామేష్‌లు వేసవి నృత్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు, శిక్షకులకు అభినందనలు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ చిన్నారులు నృత్య కళలో ఆసక్తి, క్రమశిక్షణ, అంకితభావంతో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు ఓర్పుతో శిక్షణ అందించిన గురువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు క్లాసికల్, జానపద నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. తమ నృత్య నైపుణ్యాలను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కనకం ప్రవీణ్, సహాస్, సంపత్, శ్యామ్, ఏమునూరి శివ, రజనీకాంత్, సురేష్, మనోజ్, కుమార్‌తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

