ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణది మినిస్టర్ తుమ్మల @ 40 ఇయర్స్

ది మినిస్టర్ తుమ్మల @ 40 ఇయర్స్

📰 Generate e-Paper Clip

  • నాలుగు దశాబ్దాల మంత్రిత్వ ప్రస్థానం
  • నాలుగు సీఎంల కేబినెట్‌లో అరుదైన రికార్డు
  • 1986 నుంచి 2026 వరకు ప్రజాసేవలో చెరగని ముద్ర

 

ఖమ్మం జిల్లా బ్యూరో , మే 13 (వార్త సంధ్య) : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 1986 మే 14న అన్న ఎన్టీఆర్ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల.. 2026 నాటికి నలభై ఏళ్ల మంత్రిత్వ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లలో మంత్రిగా కొనసాగిన అరుదైన నాయకుడిగా తుమ్మల రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నాయకుల్లో తుమ్మల పేరు ప్రత్యేకంగా నిలిచింది.

 

నాలుగు సీఎంలతో మంత్రిగా ప్రస్థానం :

1986 మే 14 – ఎన్టీఆర్ కేబినెట్‌లో తొలి ప్రమాణ స్వీకారం

1995 అక్టోబర్ 8 – చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి

2014 డిసెంబర్ 16 – కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి

2023 డిసెంబర్ 7 – రేవంత్ రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి

 

ఇరిగేషన్ నుంచి ఆర్ అండ్ బీ వరకు కీలక శాఖలు :తుమ్మల చిన్న నీటి పారుదల శాఖతో రాజకీయ పరిపాలన ప్రారంభించి.. మేజర్ & మీడియం ఇరిగేషన్, ఎక్సైజ్, ప్రొహిబిషన్, ఆర్ అండ్ బీ వంటి కీలక శాఖలను సమర్థంగా నిర్వహించారు. వాగులు, వంకలు, నదులపై లోతైన అవగాహనతో సాగు నీటి ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

 

రహదారులు అభివృద్ధికి బాటలు :

పల్లెల అభివృద్ధికి రహదారులే మూలం అన్న నమ్మకంతో తుమ్మల పని చేశారు. కోయగూడాల్లో రోడ్లు లేక ప్రజలు పడిన ఇబ్బందులను చిన్నతనంలోనే చూసిన ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు.

సూర్యాపేట–దేవరపల్లి, కోదాడ–కురవి, అమరావతి–నాగపూర్ జాతీయ రహదారుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

 

సీతారామ ప్రాజెక్ట్‌కు ప్రధాన శక్తి :

గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో సీతారామ ప్రాజెక్ట్ కోసం తుమ్మల నిరంతరం కృషి చేశారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్‌కు పునాది పడగా.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పనులు వేగంగా పూర్తి దశకు చేరుకున్నాయి.

భక్త రామదాసు ప్రాజెక్ట్, ఎన్టీఆర్ కెనాల్, వైరా లింక్ కెనాల్, మంచుకొండ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులు రైతాంగానికి వరప్రసాదాలుగా మారాయి.

పామాయిల్ సాగుకు మార్గదర్శి :

ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలి పామాయిల్ మొక్క నాటించి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టిన నాయకుడు తుమ్మల. ప్రస్తుతం తెలంగాణను దేశంలో ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి చేస్తున్నారు.

ఖమ్మం ఆధునిక రూపశిల్పి :

ఖమ్మం నగర అభివృద్ధిలో తుమ్మల దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది.

ఖమ్మం బైపాస్ రోడ్డు, మున్నేరు కేబుల్ బ్రిడ్జ్, లకారం ట్యాంక్ బండ్, ఖిల్లా రోప్‌వే, అర్బన్ పార్క్, సర్దార్ పటేల్ స్టేడియం, మోడల్ మిర్చి మార్కెట్, రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులు ఆయన విజన్‌కు నిదర్శనాలు.

 

మూడు పార్టీల్లో మంత్రిగా అరుదైన ఘనత :

 

తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో.. టీఆర్ఎస్‌లో కేసీఆర్ కేబినెట్‌లో.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతూ మూడు పార్టీల్లో పనిచేసిన అరుదైన నాయకుడిగా తుమ్మల నిలిచారు. ప్రజా సేవే లక్ష్యం పదవులు శాశ్వతం కావని.. చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయని నమ్మిన తుమ్మల.. అవినీతి రహిత పరిపాలన, అజాత శత్రుత్వం, గాంధేయ రాజకీయాలతో ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ఎన్టీఆర్ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రేక్షకుల తరుపున మా వార్త సంధ్య దినపత్రిక తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!