- మా ఆస్తిత్వాన్ని చెరిపివేయొద్దు: అడ్వకేట్ జి. కిరణ్ రాజ్
- ట్రాన్స్ మెన్ హక్కులకు భంగం కలిగించే బిల్లు అని విమర్శ
- కేంద్రం బిల్లుపై పునరాలోచించాలని డిమాండ్
హైదరాబాద్ సిటీ, మార్చి 17 (వార్త సంధ్య): ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డు మాజీ సభ్యుడు అడ్వకేట్ జి. కిరణ్ రాజ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ (అమెండ్మెంట్) బిల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు ట్రాన్స్ మెన్ వర్గాన్ని పూర్తిగా అణగదొక్కే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణ బిల్లు ట్రాన్స్ మెన్‌లను చట్టపరమైన నిర్వచనం నుంచి దూరం చేసే ప్రమాదం ఉందని విమర్శించారు.దీని వల్ల వేలాది మంది ట్రాన్స్ మెన్ తమ గుర్తింపును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల కుటుంబాల్లో బలవంతపు వివాహాలు, అవమానకరమైన కరెక్షన్ థెరపీలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ట్రాన్స్‌జెండర్ సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉందని కిరణ్ రాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుపై పునరాలోచించి, బాధిత వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కిరణ్ నాయక్, డాక్టర్ నీతి, శృతి, సావిత్రి, స్వేచ్ఛ, ఆర్.పీ. సమన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

