- అదనపు కమర్షియల్ సిలిండర్ల కోసం కేంద్రానికి లేఖ
హైదరాబాద్ సిటీ ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15:రాష్ట్రంలో ఎల్‌పీజీ సరఫరా స్థిరంగా ఉండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాలో తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
శనివారం సచివాలయంలో తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ఎల్‌పీజీ సరఫరా పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలు డిమాండ్‌లో కేవలం 20 శాతం మాత్రమే అందుతున్నాయని తెలిపారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా సాధారణ స్థాయిలో కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 8010 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రోజుకు దాదాపు 2.15 లక్షల సిలిండర్లు పంపిణీ అవుతున్నాయని తెలిపారు. అయితే కమర్షియల్ ఎల్‌పీజీ విషయంలో రోజువారీ అవసరం 23 వేల సిలిండర్లు ఉండగా ప్రస్తుతం కేవలం 6,200 సిలిండర్లు మాత్రమే అందుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణలో సుమారు 1.3 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా 1.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు వాణిజ్య వినియోగదారులు ఉన్నట్లు అంచనా. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు ప్రభావితమవుతున్నాయని, అందువల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ సంస్థలు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నాయని మంత్రి వివరించారు.
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు ఎల్‌పీజీ కొరతతో మెనూలను తగ్గించడం, కొంతమంది తాత్కాలికంగా అవుట్‌లెట్లను మూసివేయడం వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ కూడా అధికారికంగా ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు.
పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటలపాటు పనిచేస్తుందని మంత్రి తెలిపారు. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు 1800-428-00-333 మరియు 1967 ద్వారా ప్రజలు ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఎల్‌పీజీ సిలిండర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డొమెస్టిక్ రీఫిల్‌ల విషయంలో భయాందోళనలకు గురై అధిక బుకింగ్‌లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు 1,740 కిలోలీటర్ల కిరోసిన్ నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఎల్‌పీజీ సరఫరా పరిస్థితిని రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కమిటీ, కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అవసరమైన రక్షణ, సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

