సారంగాపూర్ మండలం (వార్త సంధ్య) – మార్చి 15 : స్థానిక పెంబట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికులు చూపుతున్న చొరవను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కోలపాక రాధా-రాజు మాట్లాడుతూ, సఫాయి కార్మికులు చేసేది కేవలం పని మాత్రమే కాదని, అది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప సామాజిక సేవ అని కొనియాడారు. అందరూ నిద్రలేవకముందే గ్రామాన్ని శుభ్రం చేసే వారి కష్టం ఎంతో గొప్పదని, గ్రామ అభివృద్ధిలో వారు నిజమైన సైనికులని పేర్కొన్నారు.ఉప సర్పంచ్ మైదం ప్రభాకర్ మాట్లాడుతూ, పెంబట్ల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. అందుకు ప్రతి సఫాయి కార్మికుడు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా ప్రతి గల్లీని అద్దంలా తీర్చిదిద్దాలని, ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడడం మన మొదటి ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు.కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పంచాయతీ పాలకవర్గం ఎల్లప్పుడూ ముందుంటుందని, వారికి అవసరమైన రక్షణ పరికరాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, సఫాయి సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండా పనిచేస్తామని కార్మికులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
గ్రామ అభివృద్ధిలో సఫాయి కార్మికులే నిజమైన సైనికులు: సర్పంచ్, ఉప సర్పంచ్
0
9

