- గ్యాస్ సిలిండర్ల సరఫరా, రబీ పంటలకు సాగునీటి అందుబాటు, వరి ధాన్యం కొనుగోలు అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
- జిల్లా కలెక్టర్లు అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం
హైదరాబాద్, వార్త సంధ్య : గ్యాస్ సిలిండర్ల సరఫరా, రబీ పంటలకు సాగునీటి అందుబాటు, వరి ధాన్యం కొనుగోలు అంశాలపై శుక్రవారం హైదరాబాదు నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా అందిస్తామని భరోసా ఇచ్చారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరఫరా సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటల కోత పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ సాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని రైతులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో తగు చర్యలు తీసుకుని నిల్వ కేంద్రాలను గుర్తించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఆయిల్ పామ్ మరియు ఉద్యాన పంటలను రైతులు సాగు చేయడానికి ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల కొరతపై కొన్ని మీడియా మరియు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల వల్ల ప్రజలు అపోహలకు గురికాకుండా అధికారులు గ్యాస్ ఏజెన్సీలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొంతమంది వినియోగదారులు ముందుగానే గ్యాస్ బుక్ చేసుకుంటున్న నేపథ్యంలో బుకింగ్ పీరియడ్‌ను 15 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు తెలిపారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 99 రోజులపాటు నిర్విఘ్నంగా కొనసాగించాలని సీఎస్ ఆదేశించారు. ఏప్రిల్ రెండవ తేదీన గ్రామ, వార్డు సభలు నిర్వహించి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని చెప్పారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడిన కలెక్టర్ జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిలిండర్ల సరఫరా చేయాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు దీనిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వనజాత, మేనేజర్ హరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, మార్కెటింగ్ శాఖ అధికారి రియాజొద్దీన్, ఇరిగేషన్ అధికారులు, మార్క్‌ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

