వనపర్తిలో న్యాయవ్యవస్థకు ఆధునిక వసతులు..
రూ.80 కోట్లతో వనపర్తి లొ ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్…..
వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్న కోర్టు సేవలు…
వనపర్తి జిల్లా ప్రతినిధి,( వార్త సంధ్య ) నవంబర్ 5:
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.80 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై ఆర్ అండ్ బి శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్‌లో మొత్తం 12 రకాల కోర్టులకు అవసరమైన ఆధునిక భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలకు ఒకే ప్రాంగణంలో మెరుగైన న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో మొదటి, రెండో అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయని, మరో అంతస్తు స్లాబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని, కొన్ని కారణాల వల్ల పనుల్లో స్వల్ప జాప్యం చోటుచేసుకుందని వివరించారు.నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.వనపర్తి జిల్లా న్యాయవ్యవస్థకు ఆధునిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన న్యాయసేవలు అందించడంలో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ ఎస్‌ఈ, ఈఈతో పాటు ఇతర అధికారులు,వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ఎస్ ఎల్ ఎన్ రమేష్,వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

