ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeరాజకీయంఉప సర్పంచుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధం

ఉప సర్పంచుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధం

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్,ఇందిరాపార్క్ ధర్నా చౌక్, భవిష్యత్ ప్రజాపాలన

  ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడిన ఉప సర్పంచుల ఫోరం

హైదరాబాద్, వార్త సంధ్య : గ్రామీణ పాలనలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప సర్పంచులను ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టిందని తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ, అధికారాలు లేకుండా కేవలం పేరుకే పదవులు మిగిలిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జూన్ 25, 2026న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర స్థాయి భారీ ఎత్తున ధర్నా మరియు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు నలుమూలల నుంచి వేలాది మంది ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైనారు

ఫోరం నాయకులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్య అని ఆరోపించారు. ఒకవైపు గ్రామాల అభివృద్ధి బాధ్యతలు అప్పగిస్తూ, మరోవైపు నిర్ణయాధికారాలు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. చెక్ పవర్ రద్దుపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, ఉప సర్పంచుల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలోని వేలాది మంది ఉప సర్పంచులు ఎలాంటి గౌరవ వేతనం లేకుండా ప్రజా సేవ చేస్తున్నారని, వారి సేవలను గుర్తిస్తూ నెలకు కనీసం ₹5,000 గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. అలాగే గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వార్డు సభ్యులకు నెలకు ₹3,000 గౌరవ వేతనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లు లేకపోవడం అవమానకరమని ఫోరం అభిప్రాయపడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా వారి పేర్లు కూడా శిలాఫలకాలపై తప్పనిసరిగా ఉండాలని, గ్రామ పంచాయతీ తీర్మానాలు మరియు అధికారిక పత్రాలపై ఉప సర్పంచుల సంతకాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచులు అనేక పరిపాలనా, ఆర్థిక మరియు అధికార సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని కోరింది. గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాలంటే ఉప సర్పంచుల పాత్రను గౌరవించాల్సిందేనని పేర్కొంది.

“అధికారాలు లేకుండా బాధ్యతలు మాత్రమే అప్పగించడం సరైంది కాదు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఉప సర్పంచుల గౌరవం, హోదా, అధికారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. మా న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం నాయకులు హెచ్చరించారు.

గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఉప సర్పంచుల హక్కులను పరిరక్షించడం అత్యవసరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫోరం డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచులు,వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!