- సర్వర్ సమస్యలతో ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం
- గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- గృహ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరిక
తిరువూరు ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇటీవల గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ గంజా కృష్ణ మోహన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరువూరులో లోకల్ వినియోగదారులకు ఇంటింటికి గ్యాస్ సరఫరా కొనసాగుతున్నదని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సమయంలో సర్వర్ బిజీ సమస్య ఎదురవుతోందని, ఒకేసారి ఎక్కువ మంది బుకింగ్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని వివరించారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు కొంతవరకు ప్రత్యామ్నాయాలు ఉపయోగించుకునే అవకాశం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఇంకా రెండు నుంచి మూడు రోజులలో గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.అదేవిధంగా గృహ వినియోగ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగించకూడదని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని గంజా కృష్ణ మోహన్ కోరారు.

