కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? బ్లాక్ మార్కెట్‌కు బియ్యం తరలింపుపై నిఘా ఏదీ?
ప్రజల ఆకలి వ్యాపారుల లాభాలకు మార్గం కాకూడదు
బియ్యం ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
నిల్వలు, సరఫరాపై సమగ్ర తనిఖీలు చేపట్టాలి: బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 4, (వార్త సంధ్య):
రాష్ట్రంలో బియ్యం ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలపై బియ్యం ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోందని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరువు ప్రభావం స్పష్టంగా కనిపించకముందే బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయని, మార్కెట్లో నిజంగానే బియ్యం కొరత ఏర్పడిందా? లేక కొందరు వ్యాపారులు బియ్యాన్ని భారీగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ కొనుగోళ్లు, గోదాముల్లో ఉన్న నిల్వలు, రైస్ మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్న బియ్యం పరిమాణం, మార్కెట్లో సరఫరా పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర పరిశీలన జరపాలని కోరారు. అక్రమంగా నిల్వలు దాచిపెట్టి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వంపై, మార్కెట్ పర్యవేక్షణ బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. పౌరసరఫరాల శాఖ, తూనికలు–కొలతల శాఖ, సంబంధిత మార్కెట్ నియంత్రణ అధికారులు సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
బియ్యం ధరల పెరుగుదలకు అసలు కారణాలేమిటో ప్రజలకు తెలియజేయాలని, నిల్వలు, సరఫరా, విక్రయ ధరలపై పారదర్శక వివరాలు వెల్లడించాలని కోరారు. సామాన్యుల ఆహార భద్రతకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని, బియ్యం ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

