రాయికల్ శివాజీ రైతు గోనె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినతి
తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌కు వినతిపత్రం
మండలంలో రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్
జగిత్యాల జిల్లా బ్యూరో, మార్చి 16 (వార్త సంధ్య): జగిత్యాల జిల్లా రాయికల్‌లో శివాజీ రైతు గోనె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సంఘం ప్రతినిధులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దేవదాసుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కుంబల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులు మరియు ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిధుల విడుదల ఆలస్యం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అదేవిధంగా మండల కేంద్రంలో రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్‌లో మండలంలోని రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగు చేసినందున అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాయికల్ మండలానికి సమీపంలోని మేడిపల్లి, మల్లాపూర్, సారంగాపూర్ మండలాలకు చెందిన రైతులు కూడా తమ పంటను అమ్మడానికి రాయికల్‌కు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఒకే ఒక కొనుగోలు కేంద్రం ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువల్ల ఈ సీజన్‌లో రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కడపటి రాజేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు జిల్లాల గంగారెడ్డి, దమ్మా గంగారెడ్డి, జిల్లాల రాజారెడ్డి, పాతూరు జలపతి రెడ్డి, బోడుగం ముత్యం రాజు రెడ్డి, కుర్మ మహిపాల్ రెడ్డి, పాతూరి సురేష్ రెడ్డి, కడపటి మోహన్ రెడ్డి, పటేల్ గోపాల్ రెడ్డి, కుంభాల సంతోష్ రెడ్డి, జిల్లాల పెద్ద గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

