ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణపెనుగాలులు, భారీ వర్షంతో చీకటిమామిడి అల్లకల్లోలం

పెనుగాలులు, భారీ వర్షంతో చీకటిమామిడి అల్లకల్లోలం

📰 Generate e-Paper Clip

కూలిన ఇళ్లు.. నేలమట్టమైన విద్యుత్ స్తంభాలు.. చీకట్లో గ్రామం

మునుగోడు, జూన్ 14 (వార్త సంధ్య): మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు గ్రామాన్ని అతలాకుతలం చేశాయి. ప్రకృతి బీభత్సానికి గ్రామానికి చెందిన మొగుదల లింగమ్మ, కోనురెడ్డి గణేష్‌ల నివాస గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన గాలుల ధాటికి ఇళ్లపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోగా, గోడలు పాక్షికంగా కూలిపోయాయి. దీంతో ఇళ్లు నివాసయోగ్యం కాకుండా మారాయి. ఇంట్లోని సామగ్రి వర్షపు నీటిలో తడిసి భారీ నష్టం వాటిల్లింది.

అకస్మాత్తుగా సంభవించిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న తమలాంటి పేద కుటుంబాలకు ఈ విపత్తు కోలుకోలేని దెబ్బగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, గ్రామంలోని విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామమంతా అంధకారంలో మునిగిపోయింది. రాత్రి వేళల్లో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేక తాగునీటి సరఫరా, ఇతర నిత్యావసర సేవలు కూడా స్తంభించిపోయాయని గ్రామస్తులు తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామ పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామానికి వెళ్లే రహదారులపై నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర అవసరాల కోసం కూడా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ప్రకృతి బీభత్సంతో గ్రామం తీవ్రంగా నష్టపోయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు గ్రామాన్ని సందర్శించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, కూలిపోయిన విద్యుత్ స్తంభాలను మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు చీకటిమామిడి గ్రామాన్ని సాధారణ పరిస్థితులకు తీసుకురావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!