ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్ఆరోగ్యంహోటళ్లలో బొద్దింకలు.. ఎలుకల సంచారం!

హోటళ్లలో బొద్దింకలు.. ఎలుకల సంచారం!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో హోటళ్లపై టీజీ సేఫ్ కొరడా.. 544 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం

వంటగదుల్లో అపరిశుభ్రత.. గుట్కా ప్యాకెట్లు, సింథటిక్ రంగుల వినియోగం!

22 హోటళ్లలో తనిఖీలు.. 14 హోటళ్ల లైసెన్సుల సస్పెన్షన్

హైదరాబాద్, అక్టోబర్ 31 (వార్త సంధ్య): నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారా? వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటళ్లలోనే బొద్దింకలు, ఎలుకల సంచారం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్ర వంటగదులు, బూజుపట్టిన ఆహార పదార్థాలు, పదేపదే వినియోగించిన వంట నూనె వంటి ఉల్లంఘనలపై టీజీ సేఫ్ అధికారులు భారీ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 544 కిలోల కలుషిత ఆహారాన్ని ధ్వంసం చేయగా, 14 హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

22 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో తనిఖీలు!

గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో 22 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 22 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా పలు సంస్థల వంటగదుల్లో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, బూజుపట్టిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం, బొద్దింకలు, ఎలుకలు సంచరించడం అధికారుల దృష్టికి వచ్చాయి. అంతేకాకుండా ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

తనిఖీల్లో సుమారు 544 కిలోల కుళ్లిన, కలుషిత ఆహార పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 21 నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 8 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సోహైల్ రెస్టారెంట్‌లో గుట్కా ప్యాకెట్లు..

మలక్‌పేటలోని సోహైల్ రెస్టారెంట్ వంటగదిలో గుట్కా ప్యాకెట్లు, ఉమ్మిన ఆనవాళ్లు కనిపించినట్లు టీజీ సేఫ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆహార తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలు తయారుచేసే ప్రాంతాల్లో కనీస పరిశుభ్రత కూడా పాటించకపోవడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు.

లైసెన్సులు సస్పెండ్ చేసిన హోటళ్ల వివరాలు

అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం లైసెన్సులు సస్పెండ్ అయినట్లు పేర్కొన్న హోటళ్లు, రెస్టారెంట్లు ఇవి:
1. హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ – టోలిచౌకి, సంతోష్‌నగర్
2. లక్కీ రెస్టారెంట్ – సంతోష్‌నగర్
3. షా ఘౌస్ కేఫ్ – షాలిబండ
4. హోటల్ నయాబ్ – చార్మినార్
5. శ్రీ బాలాజీ ఫ్యామిలీ ధాబా – గుడిమల్కాపూర్
6. సిద్ధిక్ కబాబ్ సెంట్రల్ కిచెన్ – గుడిమల్కాపూర్
7. అల్‌సబా హోటల్ – టోలిచౌకి
8. మెహఫిల్ రెస్టారెంట్ – దిల్‌సుఖ్‌నగర్
9. డైన్ హిల్ రెస్టారెంట్ – మాసబ్‌ట్యాంక్
10. సోహైల్ రెస్టారెంట్ – మలక్‌పేట
11. హోటల్ అక్షయ టిఫిన్స్ – మలక్‌పేట
12. హోటల్ వెంకటేశ్వర – ఎంజేఆర్ రోడ్
13. అజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్ – రెతిబౌలి
హోటళ్ల యాజమాన్యాలపై నిఘా.. వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యం!

ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలను మరింత విస్తృతం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రజలు ప్రతిరోజూ ఆహారం కోసం ఆశ్రయించే హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. లైసెన్సుల సస్పెన్షన్‌తోనే చర్యలు పరిమితం కాకుండా, ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!