ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పుల్లారెడ్డి స్వీట్స్‌ ఫుడ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌!

పుల్లారెడ్డి స్వీట్స్‌ ఫుడ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో స్వీటు దుకాణాలు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ బృందాల ఆకస్మిక తనిఖీలు

13 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలతో పోలీసుల సంయుక్త దాడులు.. 16 ప్రముఖ స్వీట్‌ దుకాణాల్లో తనిఖీలు

ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై అధికారుల చర్యలు

హైదరాబాద్‌, అక్టోబర్ 31 (వార్త సంధ్య): హైదరాబాద్‌లో ప్రముఖ స్వీట్‌ దుకాణాలు, మిఠాయి తయారీ కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్‌) కొరడా ఝళిపించింది. పండుగల వేళ ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 13 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, హైదరాబాద్‌ నగర పోలీసుల సహకారంతో 16 ప్రముఖ స్వీట్‌ తయారీ, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో ప్రముఖ జి. పుల్లారెడ్డి స్వీట్స్‌ (సనత్‌నగర్‌) ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. అక్కడ నిల్వ ఉంచిన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15.03 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. పాడైన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సరైన లేబులింగ్‌ లేకపోవడం, నిల్వ విధానాల్లో లోపాలు, అపరిశుభ్రమైన తయారీ, శుభ్రపరిచే ప్రాంతాలు ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తం ఐదు సంస్థల ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేయగా, మరో ఐదు సంస్థలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. మిగిలిన సంస్థలకు షోకాజ్‌ నోటీసులు, మెరుగుదల నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. తనిఖీల సందర్భంగా కల్తీ అనుమానంతో 22 ఆహార నమూనాలను సేకరించారు. మొత్తం 3,546.5 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడం లేదా పారవేయడం ద్వారా సుమారు రూ.16.86 లక్షల విలువైన నిల్వలపై చర్యలు తీసుకున్నారు.

కొన్ని దుకాణాల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం, అపరిశుభ్రమైన వంటశాలలు, మురుగు కాలువల్లో ఆహార వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలు, పాత పత్రికలతో స్వీట్లను కప్పడం వంటి లోపాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల అనంతరం సంబంధిత సంస్థల్లో తిరిగి పరిశీలనలు నిర్వహించి నిబంధనల అమలును పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యంగా పండుగల సమయంలో ప్రజలు కొనుగోలు చేసే స్వీట్లు, ఆహార పదార్థాల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వ్యాపార సంస్థలపై ఉంది. లైసెన్స్‌ సస్పెన్షన్‌ నేపథ్యంలో పుల్లారెడ్డి స్వీట్స్‌ యాజమాన్యం నుంచి వివరణ ఏమిటి? సేకరించిన నమూనాల పరీక్షల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!