ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్హయత్‌నగర్‌లో నిర్మాణాల వెనుక అసలు కథ ఏమిటి?

హయత్‌నగర్‌లో నిర్మాణాల వెనుక అసలు కథ ఏమిటి?

📰 Generate e-Paper Clip

మాజీ కార్పొరేటర్ అండదండలతో అక్రమ నిర్మాణమా?

బీజేపీ నేత మధ్యవర్తిత్వంపై ఆరోపణలు.. లక్షల్లో వసూళ్లంటూ ప్రచారం

అధికారులకు వాటాలంటూ స్థానికుల్లో చర్చ.. పట్టించుకోని టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం?

అనుమతులు పరిశీలించి వాస్తవాలు వెల్లడించాలని స్థానికుల డిమాండ్

 

వార్త సంధ్య | ఎల్బీనగర్, సెప్టెంబర్ 7:

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన సమయంలో.. హయత్‌నగర్ సర్కిల్-14 పరిధిలోని ఓ బహుళ అంతస్తుల నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హయత్‌నగర్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి పక్కన కెప్టెన్ కుక్ హోటల్ సమీపంలో సెల్లార్‌తో పాటు బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనులు బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. భవనానికి మంజూరైన అనుమతులు ఏమిటి? ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది? ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణం ఆమోదిత ప్లాన్‌కు అనుగుణంగా ఉందా? సెల్లార్ నిర్మాణానికి నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

 

మాజీ కార్పొరేటర్ అండదండలేనా? 

ఈ నిర్మాణం వెనుక తాజా మాజీ కార్పొరేటర్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే మాజీ కార్పొరేటర్‌కు ఈ నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆరోపణలకు సంబంధించి సంబంధిత మాజీ కార్పొరేటర్ వివరణ ఇస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

బీజేపీ నేతపై బ్రోకరిజం ఆరోపణలు

ఇదే వ్యవహారంలో ఓ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడి పాత్రపై కూడా స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణదారులకు, అధికారులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాల విషయంలో ‘సెటిల్‌మెంట్’ చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా వసూలైన మొత్తంలో కొంత శాతం అధికారులకు, ఇతర మధ్యవర్తులకు వాటాలుగా చేరుతున్నాయనే ప్రచారం కూడా హయత్‌నగర్‌లో జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అయితే ఈ ఆరోపణలకు ప్రస్తుతం అధికారిక ధృవీకరణ లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్పందన, సంబంధిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వస్తేనే ఆరోపణల వాస్తవికత నిర్ధారించగలుగుతాం.

 

అధికారులకు తెలియకుండా నిర్మాణం సాధ్యమేనా?

 

భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతం రద్దీగా ఉండటంతో పాటు ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. ఇలాంటి ప్రాంతంలో సెల్లార్‌తో పాటు బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతున్నప్పుడు సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

నిర్మాణానికి అనుమతి ఉంటే.. ఆ అనుమతి కాపీని ప్రజలకు అందుబాటులో ఉంచుతారా?

అనుమతికి విరుద్ధంగా నిర్మాణం జరుగుతుంటే.. ఇప్పటివరకు ఎందుకు నిలిపివేయలేదు?

అధికారులు తనిఖీ చేశారా?

తనిఖీ చేసి ఉంటే ఏం తేలింది?

 

అనే ప్రశ్నలకు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం సమాధానం ఇవ్వాల్సి ఉంది.

 

వాటాల’ ప్రచారంపై విచారణ జరగాలి

అధికారులకు 10 శాతం వాటాలు వెళ్తున్నాయనే ప్రచారం నిజమా? లేక కేవలం పుకార్లేనా? అన్నది కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఇలాంటి ఆరోపణలు నిజమైతే అది తీవ్రమైన విషయం. కాబట్టి ఉన్నతాధికారులు ఈ అంశాన్ని కేవలం నిర్మాణ అనుమతుల కోణంలో కాకుండా.. అక్రమ నిర్మాణాలకు ఎవరైనా సహకరిస్తున్నారా? అనే కోణంలోనూ పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

 

అంజయ్యనగర్ ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరం

 

ఇటీవల అంజయ్యనగర్‌లో చోటుచేసుకున్న ఘటనతో అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా లేదా అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రతి నిర్మాణాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 

సీజ్ చేస్తారా? నోటీసులతో సరిపెడతారా?

 

హయత్‌నగర్‌లోని ఈ నిర్మాణంపై అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించి.. భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్, నిర్మాణంలో ఉన్న అంతస్తులు, సెల్లార్, సెట్‌బ్యాక్స్ తదితర అంశాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే నిర్మాణాన్ని నిలిపివేసి, చట్టప్రకారం సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

మొత్తానికి.. హయత్‌నగర్‌లోని ఈ బహుళ అంతస్తుల నిర్మాణం చుట్టూ వినిపిస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? రాజకీయ అండదండలు ఉన్నాయా? మధ్యవర్తుల పాత్ర ఏమిటి? అధికారుల నిర్లక్ష్యానికి కారణమేంటి? ‘వాటాల’ ఆరోపణల్లో నిజమెంత?

 

ఈ ప్రశ్నలకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల విచారణే సమాధానం చెప్పాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!