ఆధునిక బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం

నాగోల్, ఆగస్టు 2 (వార్త సంధ్య):
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్–కొత్తపేట ప్రాంతంలో అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 14వ శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావధి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక బ్యాంకింగ్ సేవలను ప్రతి వినియోగదారుడికి చేరువ చేయాలనే లక్ష్యంతో అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తన సేవలను విస్తరిస్తోందని తెలిపారు. వినియోగదారులకు నమ్మకమైన, వేగవంతమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలను అందించడంలో ఈ కొత్త శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభమైన ఈ శాఖలో 24 గంటల ఏటీఎం సౌకర్యం, సేఫ్ డిపాజిట్ లాకర్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వ్యక్తిగత, వ్యాపార రుణాలు తదితర ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిని సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ వైస్ చైర్మన్ సీఏ నవీన్ కుమార్ అగర్వాల్, వైస్ చైర్మన్ సురేష్ కుమార్ అగర్వాల్, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ నారాయణ్ దత్, డైరెక్టర్ల బోర్డు సభ్యులు, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యులు, జనరల్ మేనేజర్ & సీఈఓ సి.వి. రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ అగర్వాల్, బ్రాంచ్ మేనేజర్ జ్యోతి రాఠీ, ఖాతాదారులు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

