ePaper
Tuesday, March 17, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCతార్నాకలో అక్రమ నిర్మాణాల దందా…

తార్నాకలో అక్రమ నిర్మాణాల దందా…

📰 Generate e-Paper Clip

అధికారుల మౌనమే కారణమా?

  • సీజ్ చేసినా పట్టింపు లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలు

  • టౌన్ ప్లానింగ్ అధికారులపై లంచాల ఆరోపణలు

  • చర్యలు కోరుతున్న స్థానికులు… బాధ్యులపై కఠిన చర్యల డిమాండ్

హైదరాబాద్ క్రైమ్ , వార్త సంధ్య :  సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీజ్ చేసిన నిర్మాణాలపైనా ఎలాంటి చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం నోటీసులు జారీ చేయడానికే పరిమితం అవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.సీతాఫల్మండి ఫ్లైఓవర్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన భారీ అక్రమ నిర్మాణం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. పిసలోకర్ కాలనీ పరిధిలో అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసే ఈ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు భవిష్యత్తులో ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేతలు చేయకుండా, లంచాలు తీసుకుని మౌనంగా వదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో చైన్ మెన్ రాజు నిర్లక్ష్యం, సంబంధిత ఏసీపీ స్థాయి అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అక్రమ నిర్మాణాలు నిరభ్యంతరంగా కొనసాగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.

ప్రాథమికంగా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన చైన్ మెన్ సమయానికి స్పందించి ఉంటే ఈ స్థాయికి చేరుకునే పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం వెనుక అవినీతి ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తార్నాక సర్కిల్ అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!