- నల్ల బ్యాడ్జీలతో అన్ని విభాగాల్లో నిరసన
- సింగరేణి యాజమాన్యంపై ఆలస్యం ఆరోపణలు
- 30న భారీ ధర్నా, ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపు

కొత్తగూడెం/సింగరేణి, మార్చి 17 (వార్త సంధ్య): సింగరేణి సంస్థలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని గుర్తింపు సంఘం ఏఐటియుసి తీవ్రంగా విమర్శించింది. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించింది.మంగళవారం ఉదయం కార్పొరేట్ ప్రాంతంలోని అన్ని విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం యాజమాన్యానికి మెమొరాండం సమర్పించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన సమస్యలపై ఇప్పటివరకు అమలుకు సంబంధించిన సర్క్యులర్లు జారీ చేయలేదని ఏఐటియుసి నాయకులు ఆరోపించారు.ప్రధానంగా మారుపేర్లు విజిలెన్స్ కేసులు, సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కమ్ టాక్స్ సమస్య, డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి 30 వరకు గోలేటి నుంచి కొత్తగూడెం వరకు బస్ యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ నెల 30న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌లో జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి రాము, పిట్ కార్యదర్శులు నరేష్, సుధీర్, అనంతలక్ష్మి, సూర్యప్రభ, జీవి రమేష్, శ్యాం, శ్రీనివాస్, అలాగే ఏఐటియుసి నాయకులు ప్రశాంత్, నాగయ్య, సరిత, ప్రవీణ్, వేమనాచారి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

