వార్తా సంధ్య: వనపర్తి జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 4 :
వనపర్తి జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
వనపర్తి జిల్లాలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, స్థానిక క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి రాష్ట్ర స్థాయిలో రాణించేలా ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అభి స్పోర్ట్స్ అరేనాలో మహాత్మా గాంధీ జయంతి నేపథ్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి క్రీడాకారులను అభినందించారు.
క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్యే
విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. వనపర్తి జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ రాష్ట్ర స్థాయికి ఎదగాలని, రాష్ట్ర స్థాయిలోనూ తమ ప్రతిభను చాటుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎమ్మెల్యే అన్నారు.
బాలికల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తాం: కలెక్టర్ ఆదర్శ్ సురభి.
విద్యార్థులు, యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా ఉండటంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చని అన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.క్రీడల్లో గెలుపు ఒక్కటే ముఖ్యమని భావించకుండా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వంటి విలువలను అలవర్చుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో సాధన చేయాలని అన్నారు.జిల్లాలో క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పించేలా భవిష్యత్లో వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా బాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు.బ్యాడ్మింటన్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నిరంతర సాధనతో రాష్ట్ర స్థాయిలో రాణించి వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
విజేతలకు బహుమతుల ప్రదానంఅనంతరం
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, కోచ్లు, నిర్వాహకులను వారు అభినందించారు.ఈ టోర్నమెంట్లో అండర్ 15 బాయ్స్ విభాగానికి సంబంధించి 16 జట్లు పాల్గొనగా తొలి నాలుగు స్థానాల్లో రేవన్ రాజ్, కృపేష్, అశ్విన్ కుమార్ గౌతమ్ కుమార్ నిలిచారు. తొలి స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10000 రెండో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.5000 మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.3000, నాలుగో స్థానంలో నిలిచిన విజేతకు రూ.2000 నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా మెన్స్ సింగిల్స్ విభాగానికి సంబంధించి 40 జట్లు పాల్గొనగా తొలి మూడు స్థానాల్లో నిరభి కుమార్ కుమార్, ఇక్షిత్, నరసింహ నాయక్ సాయి తిలక్ రెడ్డి నిలిచారు. తొలి స్థానంలో నిలిచిన విజేతలకు రూ.20000 రెండో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10,000 మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.5000 నగదు బహుమతి అందజేశారు. మెన్స్ డబుల్స్ విభాగంలో 50 జట్లు పాల్గొనగా పరమేశ్వర్ రెడ్డి, సంతోష్ తొలి స్థానంలో, రామకృష్ణ, తిలక్ రెడ్డి రెండో స్థానంలో, నరసింహారావు రాందాస్ మూడో స్థానంలో విజేతలుగా నిలిచారు. తొలి స్థానంలో నిలిచిన విజేతలకు రూ.20000 రెండో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10,000 మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.5000 నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు, కోచ్లు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

