Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 9:10 am Posted by : VARTHA SANDHYA DESK

ఎర్రవల్లి గ్రామపంచాయతీ సమస్యలను పరిష్కరించాలి

ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించిన గ్రామ ప్రతినిధులు

అచ్చంపేట ప్రతినిధి, ఆగస్టు 18 (వార్త సంధ్య): చారకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎర్రవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎర్రవల్లి–గోకారం రిజర్వాయర్ పరిధిలో ఎర్రవల్లి గ్రామంతో పాటు తండాలు ముంపునకు గురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ (R&R) ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 259 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ నోటిఫికేషన్‌కు నిరసనగా గతంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారని తెలిపారు. దీంతో గ్రామానికి సర్పంచ్, పాలకమండలి లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు సంక్షేమ పథకాలు అందడం లేదు

రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురయ్యే భూములను ఆన్‌లైన్ రికార్డుల నుంచి తొలగించడంతో నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం అందకముందే రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు దూరమవుతున్నామని రైతులు తెలిపారు. యూరియా బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వరి, పత్తి పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేక దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని వాపోయారు.

R&R నోటిఫికేషన్‌పై పునరాలోచించి బాధితులకు న్యాయం చేయాలని, రైతులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.