- ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నార్సింగిలో అవగాహన కార్యక్రమం
- “మలేరియాను అంతం చేసే దిశగా కృషి” థీమ్‌తో ప్రజల్లో చైతన్యం

నార్సింగి, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నార్సింగి గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరానికి నిర్ణయించిన థీమ్ “మలేరియాను అంతం చేసే దిశగా కృషి: ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు మనం తప్పక చేయాలి” అని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. లలితా దేవి మాట్లాడుతూ మలేరియా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మలేరియా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమల పెరుగుదలను అరికట్టడం, మస్కిటో నెట్స్ వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
జ్వరం, వణుకు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పరీక్షలు మరియు చికిత్స సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా టీబీ రోగుల కోసం పోషకాహారం అందించేందుకు టీబీ న్యూట్రిషన్ కిట్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సిహెచ్ రాకేష్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ పూనం, డిస్ట్రిక్ ప్రోగ్రాం ఆఫీసర్ అక్రమ్, సబ్ యూనిట్ ఆఫీసర్ టి. నారాయణ, కె. జగన్ తదితరులు, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.