Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:53 pm Posted by : VARTHA SANDHYA DESK

అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

  • చార్జ్ తీసుకున్న తొలి రోజే ఫీల్డ్‌లోకి దిగిన IPS సుమతి
  • దిల్సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడి వాస్తవ పరిస్థితుల పరిశీలన

హైదరాబాద్, / మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో, సంధ్య, మే 06: పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అర్ధరాత్రి ఫీల్డ్‌లోకి దిగిన మహిళా కమిషనర్ సుమతి సంచలన చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలో మహిళల భద్రతపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా సాధారణ మహిళలా దిల్సుఖ్‌నగర్ బస్టాండ్‌కు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో బస్టాండ్‌కు చేరుకున్న సుమతి, అక్కడ సాధారణ మహిళగా బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. తన అసలు గుర్తింపును బయటపెట్టకుండా, మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ సమయంలో సుమారు 40 మంది యువకులు ఆమె చుట్టూ గుమికూడి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.

ఈ యువకుల్లో చాలా మంది విద్యార్థులే కాగా, కొందరు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పరిస్థితిని గమనించినప్పటికీ, ఆ ప్రాంతంలో పర్యవేక్షణలో ఉన్న పోలీసులు స్పందించకపోవడం ఆందోళనకర అంశంగా మారింది. మూడు గంటల పాటు అక్కడ ఎవరూ జోక్యం చేసుకోకపోవడం పోలీసింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అయితే, పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సుమతి ధైర్యంగా అక్కడే నిలబడి ప్రతి అంశాన్ని గమనించారు. చివరికి ఉదయం 3:30 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న బీట్ కానిస్టేబుల్ పరిస్థితిని గుర్తించినట్లు సమాచారం.

ఈ ఘటన అనంతరం కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు దిల్సుఖ్‌నగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో స్వయంగా నిఘా ఏర్పాటు చేసి, సమస్యకు మూల కారణాలను విశ్లేషించారు. ఆపై చర్యగా ఆ ప్రాంతంలో అల్లరి చేస్తున్న సుమారు 40 మంది యువకులను అదుపులోకి తీసుకుని, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

చదువుకోవాల్సిన వయస్సులో ఉన్న విద్యార్థులు రాత్రి వేళల్లో ఇలాంటి పోకిరి చేష్టలకు పాల్పడటం ఆందోళన కలిగించే అంశమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా హాస్టల్స్ ఉండటం వల్ల ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు.

ఈ సంఘటనతో నగరంలో మహిళల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. పోలీసులు రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయడం, యువతలో అవగాహన పెంచడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు