- పేదల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాగృతి అధ్యక్షురాలు
- రిటైర్డ్ జడ్జి, మేధావులు, న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు
- బాధితులకు సంపూర్ణ న్యాయం వరకు పోరాటం కొనసాగింపు
హైదరాబాద్, మార్చి 17 (వార్త సంధ్య): సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెలుగుమట్ల ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై నిజ నిర్ధారణ కోసం రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటపడుతుందని స్పష్టం చేశారు.వెలుగుమట్లలో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా సుమారు 750 ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని కవిత విమర్శించారు. ప్రజాపోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్పందించి 350 మందికి పట్టాలు, మరో 110 మందికి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదని పేర్కొన్నారు.
బాధితులందరికీ సమగ్ర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఆర్మీ మాజీ మేజర్ మదన్ మోహన్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమారస్వామి, రామయ్య, న్యాయవాదులు సుంకర నరేష్, శ్రావణ్ గౌడ్, నూర్జన్, జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాశ్ గౌడ్, క్రాంతి తదితరులు కమిటీలో ఉన్నారని వివరించారు.ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి పూర్తిగా సహకరించాలని, బాధితుల ఇళ్లు పూర్తయ్యే వరకు వారి జీవనోపాధికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కవిత డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అప్పటి వరకు బాధితులు ఎక్కడ నివసించాలనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి వంటి మేధావులు ఈ అంశంపై స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. మేధావుల మౌనం సమాజానికి నష్టం చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.జాగృతి, ధర్మసమాజ్ పార్టీ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కొంతవరకు స్పందించినప్పటికీ సంపూర్ణ న్యాయం ఇంకా జరగలేదని పేర్కొంటూ, కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.