Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 9:07 pm Posted by : VARTHA SANDHYA DESK

ఇండ్ల స్థలాల కోసం ఆమరణ దీక్షకు టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధం

ఖమ్మం, ఏప్రిల్ 1 (వార్త సంధ్య):
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకూ సిద్ధమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ప్రకటించింది. ఖమ్మం నగరంలోని మంచికంటి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మొదట సంతకాల సేకరణ కార్యక్రమంతో ఉద్యమాన్ని ప్రారంభించి, అనంతరం ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, మంత్రుల శిబిర కార్యాలయాల ముట్టడులు, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. చివరి దశలో ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.సమావేశంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు, విద్యా ఫీజుల రాయితీలు వంటి సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కార్డులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడటం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని నాయకులు విమర్శించారు. రానున్న ఉద్యమ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశం అనంతరం రిలే నిరాహార దీక్ష నిర్వహించిన సభ్యుడు కొరకొప్పుల రాంబాబును సన్మానించారు.