Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:59 pm Posted by : VARTHA SANDHYA DESK

గ్రామ దేవతల ఆలయాల్లో కుమ్మరులను శాశ్వత పూజారులుగా నియమించాలి

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం వినతి

కుమ్మర పూజారులకు గౌరవ వేతనాలు, దీపదూప నైవేద్యాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 16 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ దేవతల ఆలయాల్లో అనాదిగా దీప, ధూప, నైవేద్యాలు సమర్పిస్తూ వస్తున్న కుమ్మర కులస్థులను శాశ్వత పూజారులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (టీఆర్‌కేఎస్) రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత్ రావు ప్రభుత్వాన్ని కోరారు.

మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో గల దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ స్వగృహంలో ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని గ్రామ దేవతల ఆలయాల్లో సంప్రదాయంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుమ్మరులకు అధికారిక గుర్తింపు కల్పించాలని కోరారు.అదేవిధంగా గ్రామ దేవతల ఆలయాల్లో జరిగే దీప, ధూప, నైవేద్య కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు కుమ్మర పూజారులకు గౌరవ వేతనాలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో (G.O.) జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి కొండా సురేఖ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈనాడు పత్రిక సీనియర్ పాత్రికేయులు ఆకారం మల్లేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి నాగపూరి నగేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లెల శంకరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి అగిరిశెట్టి వీరన్న, రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుడు ఏరుకొండ శ్రీనివాస్, ఎల్‌బీనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు నడికుడ అశోక్ తదితరులు పాల్గొన్నారు.