Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 5:33 pm Posted by : kasaramkrushna@gmail.com

సన్న వరి సాగు – లింగాపూర్ రైతుల ఆదర్శం

దుబ్బాక ప్రతినిధి మే 04(వార్త సంధ్య)

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామం ప్రస్తుతం సన్న వరి సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పంట మార్పిడిని అవలంబించిన స్థానిక రైతులు దొడ్డు రకం వరి నుంచి సన్న రకం వరికి మారి అధిక లాభాలు పొందుతున్నారు. మార్కెట్లో ఈ సన్న వరికి మంచి డిమాండ్ ఉండడంతో, హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఎన్ఎల్ఆర్, కెఎన్ఎం, ఆర్ఎన్ఆర్ వంటి సన్న రకాలను సాగు చేస్తున్నారు. ఈ విత్తనాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు తెగుళ్ల సమస్య కూడా తక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అలాగే రసాయనాలు, యూరియా వినియోగం కూడా తగ్గిందని వెల్లడించారు.

రైతుల ప్రకారం, ఒక ఎకరానికి 25 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్లో డిమాండ్ బాగుండటంతో కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. కేవలం 30 కేజీల సన్న వరి విత్తన బస్తాతో రెండు ఎకరాల వరకు సాగు చేయవచ్చని పేర్కొన్నారు.

రైతులను కలిసిన దుబ్బాక వ్యాపారవేత్త చింతరాజు మాట్లాడుతూ, పంట మార్పిడే రైతులకు మేలు చేస్తుందని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలో సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు రైస్ మిల్ అసోసియేషన్ ద్వారా 2500 విత్తన బస్తాలను బుక్ చేసి, ప్రతి బస్తాపై ₹200 సబ్సిడీతో రైతులకు అందజేస్తామని తెలిపారు.

అలాగే, లింగాపూర్‌లో సాగు పద్ధతులను పరిశీలించేందుకు ఇతర ప్రాంతాల రైతులకు బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ గ్రామం సక్సెస్ చూసి జిల్లా వ్యాప్తంగా రైతులు సందర్శిస్తున్నారు.

పంట మార్పిడితో రైతుల జీవితం మారుతోందని, మార్కెట్ డిమాండ్‌ను గుర్తించి సాగు చేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చని లింగాపూర్ రైతులు నిరూపిస్తున్నారు.