
హైదరాబాద్, జూలై 23 (వార్త సంధ్య):
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద చేపట్టిన ధర్నాను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టుకు చెందిన ప్రజాస్వామ్యవాద న్యాయవాదులు గురువారం తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో చర్చించాల్సిన అంశాలను పార్లమెంట్‌లోనే చర్చించకుండా ప్రధానమంత్రి నివాసం వద్ద ఆందోళన చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, రాజ్యాంగబద్ధ విలువలకు విరుద్ధమని న్యాయవాదులు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణించిన వారు, ఇలాంటి రాజకీయ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా “Save Nation – Save Democracy”, “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి”, “రాజ్యాంగ విలువలను పరిరక్షిద్దాం” వంటి నినాదాలతో నిరసన తెలిపారు.
భవిష్యత్తులో రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు విరుద్ధంగా లేదా ప్రజాస్వామ్య సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవాదులు హెచ్చరించారు.