ప్రకృతితో పాటు అందరినీ ఒకే చోట చేర్చే మహోన్నత పండుగ తీజ్
భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్
సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 23 (వార్త సంధ్య): బంజారా (లంబాడా) సమాజ సంస్కృతి, సంప్రదాయాల్లో తీజ్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ అన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించే బంజారా సమాజానికి తీజ్ పండుగ ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. భాగ్యనగర్ తండాలో తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా తండాలోని యువతులు అత్యంత భక్తిశ్రద్ధలతో తీజ్ పూజలు నిర్వహించారు. పండుగ ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ హీరాలాల్ మాట్లాడుతూ.. బంజారా సమాజ జీవన విధానంలో ప్రకృతి, భూమి, పంటలు, పశుసంపదకు విశేషమైన స్థానం ఉందన్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను నేటి తరానికి అందించడంలో తీజ్ వంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
నిమజ్జన కార్యక్రమానికి ముందు దేవతలకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు బంజారా సంప్రదాయ దుస్తుల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తీజ్ పండుగ ప్రకృతితో అనుబంధాన్ని చాటడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులందరినీ ఒకే చోటకు చేర్చే మహోన్నత పండుగగా నిలుస్తుందని హీరాలాల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్, బానోత్ రాందాస్ నాయక్, లకావత్ దామ్లా, భగవాన్ దాస్, హతీయ, బాబా, తోప్య, బానోత్ రాంచందర్, బానోత్ మంగీలాల్, లావుడ్య ఈర్య, భూక్య తారాచంద్, వీరన్న, గాంధీ, రాంబాబు, గోబ్రియ, బాబు తదితరులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.