Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 9:45 pm Posted by : VARTHA SANDHYA DESK

మర్మమెరగని “మరణం”…

  •  న్యాయం కోరుతూ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
  • రూ.3 లక్షల అప్పుకు రూ.20 లక్షల ఇల్లు రాసుకున్నారని ఆరోపణ
  • భర్త మృతదేహాన్ని రాజస్థాన్‌కు తరలించారని అనుమానం
  • ముగ్గురు పిల్లలతో వచ్చి న్యాయం చేయాలని వేడుకున్న మహిళ

భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, మార్చి 16 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో ఒక కుటుంబాన్ని కలవరపెడుతున్న అనుమానాస్పద మరణం, ఆస్తి వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భర్త మృతికి గల అసలు కారణాలను వెలికితీయాలని కోరుతూ ఒక మహిళ తన ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్పూర్ గ్రామానికి చెందిన రామనాథ్ (36) దశాబ్దం క్రితం ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో నివాసం ఏర్పరుచుకున్నాడు. చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్న సమయంలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని అతని భార్య ఆరోపిస్తోంది.బాధితురాలి వాదన ప్రకారం 2025 నవంబర్ నెలలో తాను భర్తతో కలిసి స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్న సమయంలో గ్రామానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారి మహిళ తన భర్తను తమ వెంట రానీయకుండా అడ్డుకున్నట్లు ఆమె తెలిపింది. దీంతో తాను ఒంటరిగా రాజస్థాన్ వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. అనంతరం పది రోజుల తర్వాత తన భర్త మరణించాడని తెలిసిందని, మృతదేహాన్ని కూడా తనకు తెలియకుండానే స్వగ్రామానికి తరలించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ పరిణామాల వల్ల భర్త మరణం సహజం కాదనే అనుమానాలు తలెత్తాయని బాధితురాలు చెబుతోంది. మరణానికి ముందు జరిగిన సంఘటనలు, తన భర్తను వెంట రానీయకుండా అడ్డుకోవడం, మరణ వార్తను ఆలస్యంగా తెలియజేయడం వంటి అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఆమె కోరింది.అదే సమయంలో మరో వివాదం కూడా మొదలైందని బాధితురాలు పేర్కొంది. వడ్డీ వ్యాపారం చేసే మహిళ తమ ఇంటిని రూ.20 లక్షలకు కొనుగోలు చేశామని చెబుతూ ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించింది. అయితే తన భర్త జీవించి ఉన్న సమయంలో ఇల్లు అమ్మకం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగలేదని ఆమె స్పష్టం చేసింది.తనకు తెలిసిన మేరకు తన భర్త ఆ మహిళ వద్ద నుంచి కేవలం రూ.3 లక్షలు మాత్రమే అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించారని పేర్కొంది. అయినప్పటికీ రూ.20 లక్షలకు ఇల్లు కొనుగోలు చేశామని చెబుతూ నకిలీ పత్రాలు చూపిస్తున్నారని ఆరోపించింది. ఈ పత్రాల ఆధారంగా తమ కుటుంబాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

ఇల్లు ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, కొంతమంది వ్యక్తులు తరచూ ఇంటికి వచ్చి మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తన ముగ్గురు చిన్నపిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసు రక్షణ కల్పించాలని కోరింది.భర్త మరణానికి గల అసలు కారణాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పదంగా ఉన్న పత్రాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆమె అధికారులను అభ్యర్థించింది. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అనుమానాస్పద మరణం, మరోవైపు ఆస్తి వివాదం, బెదిరింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికులు కూడా ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.