Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:12 pm Posted by : VARTHA SANDHYA DESK

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు : శ్యాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

  • ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి
  • ఎన్నికల హామీమేరకు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
  • ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి
  • కొత్తగూడెం శ్యాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం కార్పొరేషన్, ఏప్రిల్ 21 ( వార్త సంధ్య) : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెకు సీపీఐ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సూచించారు. అలాగే, నిలిచిపోయిన రెండు వేతన సవరణలను వెంటనే అమలు చేసి, 2013 వేతన సవరణ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా కొత్త బస్సులను కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమ్మెను నివారించాలని సూచించారు. కార్మికుల ఐక్యతతోనే హక్కులు సాధ్యమని, సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదే సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడుతూ, కార్మికుల సమ్మె పాలకులకు గుణపాఠంగా మారాలని అన్నారు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమ్మె శాంతియుతంగా, సంపూర్ణంగా జరిగేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు.