Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:53 am Posted by : VARTHA SANDHYA DESK

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం ..

  • ఈనెల 26 నుంచి వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు
  • “అపర భద్రాద్రి”గా ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రం
  • భక్తులతో కళకళలాడనున్న అటవీ గుట్టపై ఆలయం


అచ్చంపేట ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య):నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం రాములోరి కల్యాణానికి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈనెల 26వ తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పరిసరాలు వేడుక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి.సిర్సనగండ్ల క్షేత్రం “అపర భద్రాద్రి”గా ప్రసిద్ధి చెందింది. దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టపై వెలసిన ఈ ఆలయం దాదాపు 14వ శతాబ్దానికి చెందినదిగా శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. సుమారు 300 అడుగుల ఎత్తులో, 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయం శోడశ స్తంభాలతో ప్రత్యేక శిల్పకళను ప్రతిబింబిస్తుంది.పురాణ కథనాల ప్రకారం, సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి స్వప్నంలో శ్రీరాముడు దర్శనమిచ్చి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించమని ఆదేశించినట్లు చెబుతారు. పాల్వంచ సమీపం నుంచి తీసుకొచ్చిన ఆ విగ్రహాలను గుట్టపై ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికుల నమ్మకం. ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యంగా ఉండి, దత్తాత్రేయ ఆశ్రమం ఉన్నట్లు కూడా విశ్వసిస్తారు.

ఈ క్షేత్రంలో శ్రీ సీతారామలక్ష్మణుల మూలవిగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాముడు, లక్ష్మణులకు మీసకట్టు ఉండటం ఇక్కడి విగ్రహాల ప్రత్యేకత. ఆలయంలో నవగ్రహాలు, రామలింగేశ్వరాలయం, హనుమాన్ సన్నిధి, దత్తాత్రేయ ఆలయం తదితర ఉపాలయాలు కూడా ఉన్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాముల కల్యాణం, పెద్ద తేరు ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. “శిరుసనగండ్ల శ్రీసీతారామ శిరస్సు వంచి మొక్కుతా…” అంటూ భక్తులు కొండ ఎక్కుతూ స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా నిలిచింది. తెలంగాణలో రెండవ భద్రాచలంగా పేరొందిన ఈ పుణ్యక్షేత్రం సంవత్సరం పొడవునా భక్తులతో కళకళలాడుతూ నిత్యపూజలు, ఉత్సవాలతో ఆధ్యాత్మిక కేంద్రముగా విరాజిల్లుతోంది.