ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని పిలుపు

ఎల్బీనగర్ , జూన్ 12 (వార్త సంధ్య):ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాక్ హిల్స్ కాలనీలోని ఎస్‌వీఎల్ అరేనాలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మధుయాష్కి గౌడ్‌తో పాటు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బీఎల్‌ఏల నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నెల గద్దర్, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అనూహ్యంగా కోట్ల సంఖ్యలో కొత్త ఓట్లు చేర్చడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఈ అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తావించినప్పటికీ తగిన స్పందన రాలేదని అన్నారు. రాబోయే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఏలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఓటర్ల చేర్పులు, తొలగింపులపై బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ, పేద మరియు బలహీన వర్గాల ఓట్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీఎల్‌ఏలకు సూచించారు.
వెన్నెల గద్దర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ, ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన ఓటర్ మ్యాపింగ్‌లో గణనీయమైన వ్యత్యాసాలు గుర్తించబడ్డాయని, బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం టీపీసీసీ నియమిత ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీఎల్‌ఏల బాధ్యతలు, ఓటర్ల జాబితా సవరణ విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.