18 మంది యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఐవీఎఫ్ కేంద్రాలకు అక్రమ సరఫరాపై విచారణ..?
హైదరాబాద్ (వార్తసంధ్య): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్‌నగర్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాశాల విద్యార్థినులు, నిరుపేద యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి, ఇంజెక్షన్ల ద్వారా అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేకరించిన అండాలను నగరంలోని కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలకు అనధికారికంగా సరఫరా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అండాల సేకరణలో వైద్య నిబంధనలు పాటించారా? ఏయే ఐవీఎఫ్ కేంద్రాలకు వీటిని సరఫరా చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల బేగంపేట, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లోనూ గర్ల్స్ హాస్టళ్ల ముసుగులో అక్రమ అండాల సేకరణ వ్యవహారాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనల నేపథ్యంలో ఈ అక్రమ దందా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో వెలికితీయాల్సిన అవసరం ఉంది.
.