Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 9:38 pm Posted by : VARTHA SANDHYA DESK

పీఎం మోదీ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సమర్పించారు.

తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయంలో కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు రాష్ట్రానికి అత్యంత కీలకమని వివరించారు.

మెట్రో ఫేజ్-2కు ఆమోదం కోరిన సీఎం

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణకు సంబంధించి 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి రూ.38,595 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్టుగా ఆమోదించాలని కోరారు.

రీజినల్ రింగ్ రోడ్డుకు వేగం కావాలి

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనులకు తక్షణ ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించిన 90 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

దక్షిణ కారిడార్ నిర్మాణం కూడా రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైనదని పేర్కొంటూ, చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఒకేసారి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్-అమరావతి-బందర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన

హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టును అనుసంధానించే 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. 120 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ప్రతిపాదించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు నేరుగా పోర్ట్ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు.ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని తెలిపారు.

వరంగల్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి

వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోరారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ఇప్పటికే పూర్తిచేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు తెలిపారు.వరంగల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌లో భారతీయ నిర్వహణ సంస్థ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఐఐఎం కోసం అవసరమైన 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టీఐఎఫ్‌ఆర్ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయని, ఐఐఎం ఏర్పాటుతో జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాల సాధనకు మరింత తోడ్పాటు అందుతుందని ప్రధానమంత్రికి వివరించారు. తెలంగాణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పురోగతి దిశగా ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.