Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 7:12 pm Posted by : VARTHA SANDHYA DESK

రంగారెడ్డి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు

281 మంది లైసెన్స్ సర్వేయర్లతో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సమీక్ష సమావేశం

రీసర్వే, భూభారతి, భూసేకరణ పనుల నిర్వహణపై కీలక సూచనలు

రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 12 (వార్త సంధ్య) : రంగారెడ్డి జిల్లాలో ఎంపికైన 281 మంది లైసెన్స్ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, జిల్లా సర్వే అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సర్వేయర్ల విధులు, పారితోషికం, ప్రభుత్వ పనుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు.

ఈ సందర్భంగా రీసర్వే కార్యక్రమంలో ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లను ఒక బృందంగా ఎంపిక చేసి 2,000 ఎకరాల భూమిని సర్వే పూర్తి చేసినట్లయితే రూ.40 వేల పారితోషికం, 2,000 ఎకరాలకు మించి సర్వే నిర్వహిస్తే రూ.60 వేల వరకు పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు.

అలాగే సాధారణ భూసర్వే పనుల్లో ఒక ఎకరానికి రూ.20 నుంచి రూ.50 వరకు చెల్లింపులు ఉంటాయని, ప్రతి సర్వేయర్ నెలకు కనీసం 500 ఎకరాల సర్వే లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

భూభారతి, రీసర్వే, భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో లైసెన్స్ సర్వేయర్లు కీలక పాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు పారదర్శకతతో విధులు నిర్వహించాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న లైసెన్స్ సర్వేయర్లకు విధి నిర్వహణలో అనుసరించాల్సిన పలు అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రభుత్వ భూసంబంధిత కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ సమావేశాన్ని ముగించారు.