Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:38 pm Posted by : VARTHA SANDHYA DESK

ప్రజావాణికి 52 ఫిర్యాదులు

  • ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

  • రెవెన్యూ శాఖకు అత్యధికంగా 23 దరఖాస్తులు

  • ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టొద్దని సూచన


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 16 (వార్త సంధ్య): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు తెలియజేయడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారని తెలిపారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 52 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాఖల వారీగా చూస్తే రెవెన్యూ శాఖకు 23 దరఖాస్తులు, ఇతర శాఖలకు 29 దరఖాస్తులు వచ్చాయని, మొత్తం 52 ఫిర్యాదులు అందాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.