Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 12:36 pm Posted by : VARTHA SANDHYA DESK

హుస్నాబాద్–కొత్తపల్లి ఫోర్‌లేన్ పనులు వేగవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • రహదారి విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి
  • విద్యుత్ స్తంభాల తొలగింపు, టవర్ నిర్మాణాలపై ఆరా
  • కొండాపూర్ శివార్లలో కల్వర్టు పనుల తనిఖీ
  • పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
  • రూ.163.20 కోట్లతో ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం

కరీంనగర్, జూన్ 11 (వార్త సంధ్య): హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే కొత్తపల్లి రాజీవ్ రహదారి వరకు నిర్మితమవుతున్న ఫోర్‌లేన్ రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు, వాటి స్థానంలో నిర్మిస్తున్న విద్యుత్ టవర్ల నిర్మాణాన్ని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బందితో మాట్లాడి విద్యుత్ స్తంభాల తొలగింపు, లైన్ మార్పిడి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం రహదారి విస్తరణలో భాగంగా కొండాపూర్ గ్రామ శివార్లలో నిర్మితమవుతున్న కల్వర్టులను తనిఖీ చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కల్వర్టు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 కింద మొత్తం రూ.163.20 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కొత్తపల్లి నుంచి సందరగిరి వరకు 10 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు ప్యాకేజీ-1 కింద రూ.86 కోట్లు కేటాయించగా, సందరగిరి నుంచి హుస్నాబాద్ వరకు ప్యాకేజీ-2 కింద రూ.77.20 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఫోర్‌లేన్ రహదారి పూర్తయితే హుస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.